MLA protest: హజ్‌హౌస్ నిర్మాణంలో జాప్యం.. సీఎం సమాధానం చెప్పాలంటూ.. మాజీ ఎమ్మెల్యే నిరసన - YCP attacks on minorities
Former MLA Jalil Khan protest: విజయవాడ విద్యాధరపురం షాదీఖానా స్థలం వద్ద మైనారిటీలతో కలిసి మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నిరసనకు దిగారు. హజ్‌హౌస్ నిర్మాణంలో జాప్యంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుప్తా సెంటరు సమీపంలోని షాదీఖానా మైదానంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ఆవిష్కరించిన హజ్‌హౌస్ నిర్మాణ శిలాఫలకం వద్ద ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ నమూనాలతో మైనారిటీలు ఆందోళన చేశారు. ఇటీవల హజ్‌యాత్రికులకు మదర్సాను వినియోగించడం, వైఎస్సార్సీపీ రంగు బెల్లూన్లు కట్టడాన్ని ఖండించారు.
నాలుగేళ్లయినా ఇంతవరకు హజ్‌హౌస్ నిర్మాణం చేపట్టలేదని.. ముస్లిం మైనారిటీలపై వైఎస్సార్సీపీ పాలకులకున్న శ్రద్ధను ఇది తెలియజేస్తోందన్నారు. మైనారిటీలపై వరుస దాడులు, హత్యలు జరుగుతున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మైనారిటీలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసి గెలిపించారు.. కాని వారి మీద ఎన్ని అరాచకాలు చేస్తున్నా మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హజ్‌హౌస్ హైదరాబాద్‌లో కట్టారు, కడపలో కూడా కట్టారు.. కానీ జగన్ చేసింది ఏమీ లేదు ఈ రోజున మేము అందరం కూడా మిమ్మల్ని గెలిపించి తప్పు చేశాం అని అన్నారు.