Farmer Producer Associations: పంటనష్టాన్ని ఆదుకునేందు.. తెరపైకి ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు - farmer producer organisations news
Farmer Producer Associations: రైతులు పండించిన పంటలో 30 నుంచి 35% నష్టపోయే అవకాశం ఉందని.. ఈ నష్టాన్ని అంది పుచ్చుకునేందుకు ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేస్తుందని నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. 2023- 24 సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో 10 రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు. మండలంలోని కొన్ని గ్రామాలలో రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి ఈ సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయాలంటే కనీసం 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అందులో 11 లక్షల 25 వేల రూపాయలు ప్రభుత్వం రాయితీ అందిస్తుంది.. మిగిలిన మూడు లక్షల 75 వేల రూపాయలు రైతులు చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసిన వారికి పండిన ఉత్పత్తులను స్టోర్ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ 75% రాయితీతో ఇవ్వటం జరుగుతుందన్నారు. కోల్డ్ స్టోరేజ్ 12 లక్షల రూపాయల కాగా అందులో రైతులు 3 లక్షల 12 వేల రూపాయలు చెల్లిస్తే 9 లక్షల 37,500 రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకొని, పండించిన ఉద్యాన పంటలైన మామిడి ,అరటి, సపోటా, జామ, పూలు మంచి ధరలకు అమ్ముకొని లాభాలు అర్జించాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి కోరుతున్నారు.