Food Poison to Tribals: పుట్టగొడుగుల కూర తిని.. 10 మంది గిరిజనులకు అస్వస్థత..
Food Poison to Tribals : ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. రాజకీయ నాయకులు వారికి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండానే పదవి దిగిపోతున్నారు. ప్రభుత్వాలు, నాయకులు గిరిజనుల కనీస అవసరాలు తీర్చలేక చేతులెత్తేస్తున్నారు. సరైన రోడ్డు మార్గం లేక సకాలంలో వైద్యం అందక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జామిగూడలో విషతుల్యమైన పుట్టగొడుగులు కూర తిని పది మంది గిరిజనులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆటో కొంతదూరం, అక్కడి నుంచి 108 వాహనంలో పాడేరు ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో ఏడుగురు పెద్దవారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అస్వస్థతకు గురైన వారికి స్థానికి వైద్యుల చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యుల తెలిపారు.
అర్ధరాత్రి అస్వస్థకు గురికావడంతో నాలుగు కిలోమీటర్లు అతి కష్టం మీద ప్రధాన రహదారి వద్దకు తీసుకొచ్చామని.. అక్కడి నుంచి పాడేరు ఆస్పత్రికి తరలించామని, రహదారి బాగోకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.