Floods In Jagananna Colony : జలమయమైన జగనన్న కాలనీలు.. లబోదిబోమంటున్న లబ్ధిదారులు !
Flood Surge In Jagananna Colonies :ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని జగనన్న కాలనీలకు వరద పోటెత్తింది. వరద ఉద్ధృతితో బేస్‌మెంట్ కింద మట్టి కొట్టుకుపోయింది. ఫలితంగా పిల్లర్లు బయటపడ్డాయి. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. తిరువూరు పట్టణ శివారు పీటీ కొత్తూరు సమీపంలో గతంలో నాలుగు చోట్ల సేకరించిన 26 ఎకరాల్లో సెంటు చొప్పున ప్రభుత్వం నివేశన స్థలాలు పంపిణీ చేసింది. వైఎస్ఆర్ అర్బన్ పథకం కింద 1175 పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుతం నాలుగు చోట్ల 622 పక్కా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు కాలనీలోకి చేరింది. వరద పోటెత్తకుండ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో నీరు నిర్మాణంలో ఉన్న పక్కా ఇళ్ల మీదుగా ప్రవహించింది. వరద ప్రవాహ ఉదృతికి కాలనీల్లోని రహదారులు కోతకు గురి కావడం గండ్లు పడ్డాయి. మరికొన్ని రహదారులు అడుగు తీసి అడుగు వేయలేని బురదకయ్యలుగా మారాయి. వరద ప్రవాహానికి పక్కా ఇళ్ల పునాదుల కింద మట్టి కొట్టుకు పోయింది. ఫలితంగా బేస్మెంట్గా పోసిన డూమ్లు, భూమిలోని సిమెంటు పిల్లర్లు బయట పడ్డాయి.. దీంతో కొన్ని పక్కా ఇళ్లు ఒక పక్కకు ఒరిగాయి. మళ్లీ పునాది దశ నుంచి నిర్మాణం చేపట్టాలంటే తలకు మించిన భారంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.