Flood in Konaseema Lanka villages: ముంచెత్తిన గోదావరి.. కోనసీమ లంక గ్రామాల్లో పడవ ప్రయాణం - సముద్ర పోటు
Konaseema Lanka villages: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగుతోంది. కొద్ది రోజుల కిందటి వరకు ప్రమాదకర స్థాయిలో ప్రవహించిన గోదావరి.. ప్రస్తుతం శాంతించింది. రెండు రోజులుగా వరద తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉండగా.. కోనసీమ లంకలు వరద గుప్పిట్లో మగ్గుతున్నాయి. సఖినేటిపల్లి మండలం టెకిసెట్టిపాలెం అప్పన రామునిలంక, కొత్తలంక గ్రామాలు వారం రోజులుగా నీటిలో నానుతున్నాయి. లంక గ్రామాలైన అప్పనరామునిలంక, కొత్తలంక, ఓఎన్జీసీ కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. లంక గ్రామాల ప్రజలు రోజుల తరబడి నీళ్లలో ఉండిపోయారు. గ్రామాల్లోని ఇళ్లన్నీ నీటమునిగాయి. రహదారులు నీట మునిగిపోవడంతో పడవ ప్రయాణం అనివార్యమైంది. పడవలు లేని ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. రాజోలు నియోజకవర్గంలోని సకినేటిపల్లి వద్ద సముద్ర పోటు ఎక్కువగా ఉండడంతో వశిష్ట గోదావరి ప్రవాహం నెమ్మదిగా ఉంది. రోజుల తరబడి వరద నీటిలో మనుగడ సాగించడం ఇబ్బందిగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ వివరిస్తారు.