ఎర్రచందనం తరలిస్తున్న ఐదుగురి అరెస్టు, నాలుగు కోట్ల విలువైన 275 దుంగలు స్వాధీనం - Tirupati in Red sandalwood news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 12:24 PM IST
Transporting Red Sandalwood Illegally Tirupati : తిరుపతిలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఐదుగురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారు అంతరాష్ట్ర ముఠాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి తమిళనాడు వైపు అతి వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసినట్లు పోలీసులు వివరించారు. అందులో దాదాపు నాలుగు కోట్ల 31లక్షల రూపాయల విలువ గల ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను అదుపులోకి తీసుకున్నపోలీసులు.. వారి దగ్గర నుంచి 5,338 కేజీలు కలిగిన 275 ఎర్రచందనం దుంగలు, ముక్కలు, పొడి, 18 లక్షల విలువ గల రెండు కార్లు, 3200 రూపాయల నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ముఠా వెనకున్న పెద్ద స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టామని ఆయన తెలిపారు.