Father Killed Son మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కొడుకు తల, మొండెం వేరు చేసిన తండ్రి - The father who killed Kishore
Father Killed Son In Gundlapalli : పల్నాడు జిలా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. గ్రామంలోని వడ్డెర కాలనీలో తండ్రి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన వీరయ్య(45) అనే వ్యక్తి కొడుకు కిషోర్(25)ను అతి దారుణంగా నరికి చంపాడు. అనంతరం తలను మొండెం నుండి వేరుచేసి తండ్రి వీరయ్య తలను గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్థులు తెలిపారు. స్థానికుల సమాచారంతో నిందితుడిని నకరికల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్ మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కిషోర్ తల్లి గల్ఫ్ దేశంలోని కువైట్‌కు సంపాదన కోసం పనులు చేసేందుకు వెళ్లి అక్కడి నుంచి కొడుకు కిషోర్‌కు డబ్బులు పంపుతోందన్నారు. మద్యానికి బానిసైన కిషోర్ తండ్రి వీరయ్య కొడుకును మందు కోసం తరచూ డబ్బులు అడుగుతుండటంతో కొడుకు ఇవ్వలేదని తండ్రి హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు వివరించారు.
కొడుకు మృతిని తెలుసుకున్న తల్లి అలివేలు బోరున విలపించింది. కువైట్‌లో ఉంటున్న అలివేలు సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన చెందింది. తమ కుటుంబంలో కొడుకు, కూతురుకు పెళ్లిళ్లు చేయడంతో 5 లక్షలు అప్పులయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి, కొడుకులు తాగుబోతులవడంతో అప్పు తీర్చేందుకు కువైట్‌లో పనులు చేసుకునేందుకు రెండు సంవత్సరాల ఒప్పందంపై వచ్చానని వాపోయింది. కుమారుని మృతదేహాన్ని చివరి చూపు చూసుకోవాలని ఉందని, అక్కడి యజమాని ఒప్పుకోవడం లేదని రోధించింది. ఎలాగైనా తనను ఇక్కడి నుండి ఇండియాకు తీసుకువచ్చే విధంగా చేయాలని బత్తుల అలివేలు వేడుకుంటోంది.