మూడో పెళ్లికి అడ్డుగా ఉందని బాత్‌ర్రూంలో బంధించారు - చిత్రహింసలకు గురిచేసిన తండ్రి - Father Harassing Daughter in jaggayapeta
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 3:09 PM IST
|Updated : Dec 13, 2023, 3:38 PM IST
Father Harassing a Daughter: ఓ కసాయి తండ్రి తన తల్లితో కలిసి ఐదేళ్ల కూతుర్ని బాత్‌ర్రూంలో బంధించి, చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కలకలం రేపింది. మూడో వివాహానికి కూతురు అడ్డొస్తుందన్న కారణంతో పాపను బయటికి రానివ్వకుండా ఇంట్లోనే బంధించి, ఆహారం సరిగ్గా పెట్టకపోవడంతో అనారోగ్యం పాలైంది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పోలీసులకు సమాచారమివ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
CI Janakiram Comments: సీఐ జానకీరాం వెల్లడించిన వివరాల ప్రకారం ''జగ్గయ్యపేట పట్టణం నాగమయ్య బజార్‌లో నక్కా ప్రవీణ్ అనే వ్యక్తి తన తల్లి, కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. మొదటి భార్యతో అతనికి విడాకులయ్యాయి. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ద్వారా అతనికి లోహిత అనే కుమార్తె జన్మించింది. నాలుగేళ్ల క్రితం రెండో భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కూతురు లోహిత, తల్లి గోవర్ధనమ్మతో కలిసి ఉంటున్న ప్రవీణ్ తాజాగా మూడో వివాహానికి సిద్ధపడ్డాడు. కూతురు అడ్డొస్తుందన్న నెపంతో తల్లి గోవర్ధనమ్మతో కలిసి పాపను ఇంట్లోనే బంధించారు. కిటికీలు మూసేసి, తాళ్లతో కట్టేశారు. ఆహారం సరిగ్గా పెట్టకపోవడంతో పాప నీరసించి, అనారోగ్యం పాలైంది. చుట్టుపక్కల వారి సమాచారంలో పోలీస్ సిబ్బంది వెళ్లి చూడగా, ఆ పాపను బాత్రూంలో బకెట్లో పెట్టి దాచారు. విచారణ జరిపి తండ్రి, అతని తల్లిపై చర్యలు తీసుకుంటాం.'' అని సీఐ వెల్లడించారు.