Father and Son Died Due to Family Disputes: నాలుగేళ్ల కుమారుడికి పురుగుల మందు తాగించి.. తానూ తాగిన తండ్రి - దేవనకొండలో తండ్రీకొడుకులు మృతి
Father and Son Died Due to Family Disputes: కుటుంబ కలహాలు రెండు ప్రాణాలను బలికొంది. తాను చనిపోవడమే కాకుండా తన నాలుగేళ్ల కుమారుడికి సైతం పురుగులు మందు తాగించాడు ఓ తండ్రి. కర్నూలు జిల్లా దేవనకొండలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి తండ్రి, కుమారుడు మరణించారు. డోన్ మండలం కొత్తపేటకు చెందిన రాజు.. దేవనకొండకు చెందిన అనితను 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. మనస్పర్థలతో కొన్ని రోజులుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొత్తపేట నుంచి ఉదయం దేవనకొండకు వచ్చిన భర్త రాజు పురుగుల మందు తీసుకున్నాడు. దానిని తాను తీసుకొని.. తన నాలుగేళ్ల కుమారుడు ఉజ్వల్కు సైతం తాగించాడు. దీంతో తండ్రి రాజు అక్కడికక్కడే మరణించాడు. కుమారుడు ఉజ్వల్‌ను కుటుంబ సభ్యులు కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. ఈ ఘటనపై దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.