Farmers Protest Under TDP At Nandivelugu Intersection: సాగునీటి సమస్య.. ఎండుతున్న పంటలు.. మిన్నంటుతున్న రైతుల ఆందోళనలు - సీఎం జగన్పై ఏపీ రైతుల మండిపాటు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 1:49 PM IST
Farmers Protest Under TDP at Nandivelugu Intersection: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వైపు కాల్వల్లో నీటి విడుదల పెంచాలంటూ డెల్టా రైతాంగం రోడ్డెక్కగా.. ఇంకో వైపు విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండుతున్నాయంటూ ఆయకట్టేతర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా హైలెవల్ ఛానల్ పరిధిలో పొలాలకు వెంటనే నీళ్లివ్వాలంటూ.. తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేస్తున్న పంటలు ఎండిపోతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు.
ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు నేతృత్వంలో.. నందివెలుగు కూడలిలో రైతులు బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రైతన్నలు నినాదాలు చేశారు. హైలెవెల్ ఛానెల్ పరిధిలో పొలాలకు తక్షణం నీళ్లివ్వకుంటే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోయారు. ఈ ఆందోళన గురించి అక్కడికి చేరుకున్న జలవనరులశాఖ అధికారులు.. టీడీపీ నేతలతో చర్చించారు. ప్రస్తుతానికి 4వేల క్యూసెక్కులు ఇస్తున్నామని.. రెండు మూడు రోజుల్లో మరిన్ని నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్పారు.