Farmers Protest for Compensation in Kalyanadurg: నష్టపరిహారం కోసం.. కళ్యాణదుర్గంలో రైతుల నిరసన - కళ్యాణదుర్గం తాజా వార్తలు
Farmers Protest for Compensation in Kalyanadurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూనిర్వాసిత పోరాట కమిటీ ఆధ్వర్యంలో.. రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో కుందుర్పి, భైరవానితిప్ప బ్రాంచి కెనాళ్ల కోసం ఆ ప్రాంతంలోని కొందరు రైతులు తమ భూములను కోల్పోయారు. భూములు కోల్పోయిన రైతుల్లో కొంతమందికి మాత్రమే అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని భూనిర్వాసిత పోరాట కమిటీ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. దీంతో ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందుర్పి, భైరవానితిప్ప బ్రాంచి కెనాళ్ల కోసం భూమి కోల్పోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని రాహుల్ తెలిపారు. గత నెలలో రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన సీఎం జగన్.. నష్టపరిహారం ఊసే ఎత్తకుండా వెళ్లిపోయారని రైతులు వాపోయారు. ఈ కెనాళ్ల తవ్వకం కోసం భూములు ఇచ్చి చాలా నష్టపోయామని.. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.