Farmers Waiting For Compensation: వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులు.. పరిహారం కోసం పడిగాపులు - YSR Steel Plant not given Compensation
Farmers Waiting For Compensation Infront of RDO Office :వైఎస్సార్ జిల్లాలో జిల్లా వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ఎకరాల భూమి కోల్పోయిన రైతులు బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద గంటల తరబడి పడిగాపులు కాశారు. జమ్మలమడుగు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన బాధిత రైతులు బుధవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వద్దకు వెళ్లి ఎకరాల భూమి కోల్పోయిన వారిలో సుమారు 58 మందికి పరిహారం అందలేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్దకు వెళ్లమని, అధికారులతో మాట్లాడి రైతుల సమస్యకు పరిష్కారం చూస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం సుమారు 35 మంది రైతులు కార్యాలయానికి చేరుకొని గంటల తరబడి వేచి ఉన్నారు. ఉక్కు, పరిశ్రమ నిర్మాణానికి భూములు కోల్పోయిన సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన 192 మంది బాధిత రైతుల్లో 134 మందికి పరిహారం మంజూరైందని, మిగిలిన 58 మంది రైతుల్లో ముగ్గురు చనిపోగా, 27 మంది పేర్లు తప్పులుగా ఉండడంతో వారి జాబితాను సరిచేసి ఉన్నతాధికారులు దృష్టికి పంపిస్తే ఆమోదం వచ్చిందన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి రైతులు వెళ్లిపోయారు.