Farmer Union Leader Arrested పోలీస్స్టేషన్లో నాలుగేళ్ల బాలుడు, భార్యతో రైతు సంఘ నేత! - బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు
Farmer Union Leader Arrested: రైతు సంఘం నాయకుడు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్ల బాలుడుతో సహా పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అరవింద వారధి వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని బాధితుడు సురేష్ అంటున్నారు. భార్య, నాలుగేళ్ల కుమారుడితో అటు వైపు వెళ్తున్న రైతు సంఘ నాయకుడు తోడేటి సురేష్.. అక్రమ తవ్వకాలను ఫోన్లో చిత్రీకరించారు. అది గమనించిన ఇసుక మాఫియాకి చెందిన వాళ్లు అతనిని అడ్డుకుని వాగ్వాదానికి దిగి ఫోన్, ద్విచక్ర వాహనం తాళంను లాక్కుని వెళ్లిపోయారని రైతు సంఘం నాయకుడు సురేష్ ఆరోపిస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో సురేష్.. తన భార్య, నాలుగేళ్ల పిల్లాడితో అదే వంతెనపై అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ కూర్చున్నాడు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాధితుడిని పక్కకి లాగి.. భార్య, పిల్లాడితో సహా స్టేషన్కు తీసుకువెళ్లారు. పసి పిల్లాడితో సహా సురేష్, అతని భార్య స్టేషన్లో కింద కూర్చున్న దృశ్యాలు అందరినీ కలచి వేస్తున్నాయి.