Farmer Died In Suspicious: ''రంగురాళ్ల మాఫియా' దాడి వల్లే నా భర్త మృతి' - రైతుపై రంగురాళ్ల మాఫియా దాడి
Farmer died in suspicious condition: పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలో బ్రహ్మయ్య అనే రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బ్రహ్మయ్యపై గురువారం రోజున రంగురాళ్ల మాఫియా దాడి చేసిందని.. అందువల్లే తన భర్త మరణించారని ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురజాల మండలంలోని ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలు, విక్రయాలు జోరుగా జరుగుతుంటాయి. అధికార పార్టీ అండదండలతో మాఫియాగా ఏర్పడి రంగురాళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అలాంటి మాఫియా సేకరించిన రంగురాళ్లను వారు ఓ పొలంలో పోసి ఉంచారని.. వాటిని బ్రహ్మయ్యతో పాటు మరో వ్యక్తి అమ్ముకున్నారనే నేపంతోనే, వారు బ్రహ్మయ్యపై దాడి చేశారని ఆమె భార్య తెలిపింది. మాఫియా దాడి చేసిన అనంతరం తన భర్తే తనతో ఈ విషయాన్ని చెప్పాడని ఆమె పోలీసులకు వివరించింది. అతనితో ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు కూడా సేకరించారని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బయటకు వెళ్లిన బ్రహ్మయ్య సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవటంతో.. ఆతని కోసం వెతికినట్లు అతని భార్య వివరించింది. అతని ఆచూకీ కోసం వెతుకున్న సమయంలో వేరే వ్యక్తి పొలంలో బ్రహ్మయ్య మరణించి ఉన్నారని.. రంగురాళ్ల మాఫియానే హత్య చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బ్రహ్మయ్య మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష ముగిసిన అనంతరం పోలీసులు.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.