Farmer Commits Suicide Due to Debt Problem: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. - నాగసానిపల్లెలో రైతు ఆత్మహత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 1:33 PM IST
Farmer Commits Suicide Due to Debt Problem: అప్పుల బాధ తాళలేక వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెలో రైతు జేష్టాది రామసుబ్బయ్య పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎకరా సొంతభూమి, మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. పంట పెట్టుబడులకు చేసిన అప్పులతోపాటు జీవనోపాధి కోసం తెచ్చుకున్న లగేజీ ఆటో ఫైనాన్స్ అప్పులు పెరిగాయి. దాదాపు రూ.5లక్షలు అప్పులు చేసినట్లు బంధువులు తెలిపారు. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి రావడంతో చెల్లించలేక సాగు చేస్తున్న పొలం వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పొలం పనులు చేసుకుంటున్న భార్య ఓబులమ్మ గమనించి.. హుటాహుటిన మైదుకూరులోని సామాజిక ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. రామసుబ్బయ్యకు భార్య, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. కుటుంబ సమస్యలు లేవని, అప్పులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో దిక్కుతోచక బలవన్మరణానికి పాల్పడినట్లు రామసుబ్బయ్య మేనల్లుడు సంపత్ తెలిపారు. ఈ ఘటనతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.