Fake Whatsapp Group: కనిగిరిలో టీడీపీ ఫేక్ వాట్సప్ గ్రూపు కలకలం.. బురద జల్లేందుకే అని మండిపాటు - ఏపీ తాజా వార్తలు
Fake Whatsapp Group In kanigiri: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఫేక్ వాట్సప్ గ్రూపును క్రియేట్ చేయడం, అందులో అశ్లీల చిత్రాలు అప్లోడ్ చేయడం తాజాగా కలకలం రేపింది. దీనిపై స్థానిక నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనిగిరి పట్టణంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులను గ్రూపు సభ్యులుగా చేర్చి.. 'టీడీపీ కనిగిరి' అనే ఫేక్ వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. అనంతరం అశ్లీల చిత్రాలతో పాటు అసభ్యకర సందేశాలను పోస్ట్ చేయడమే కాక పలువురి ప్రముఖుల ఫోటోలను సైతం మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఫేక్ వాట్సప్ గ్రూపునకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబందం లేదని స్పష్టం చేశారు. అంతేకాక తమపై రాజకీయ కుట్రలో భాగంగానే కొందరు వ్యక్తులు పని కట్టుకొని మరీ తెలుగుదేశం పార్టీపై బురద చల్లాలనే నెపంతో ఇలాంటి పనులు చేస్తుంటారని మండపడ్డారు. ఫేక్ వాట్సప్ ఖాతాను టీడీపీ పేరుతో క్రియేట్ చేసిన వారిని.. అందుకు ప్రోత్సహించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఫేక్ వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసిన వ్యక్తిని తమదైన శైలిలో త్వరలోనే అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు.