Fake Medicines in Vijayawada: విజయవాడలో నకిలీ మందుల రాకెట్.. తనిఖీల్లో భారీగా వెలుగులోకి - ఔషధాల శాంపిల్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 4:26 PM IST
Fake medicines in Vijayawada: బెజవాడలో భారీగా నకిలీ మందులు బయటపడ్డాయి. వన్ టౌన్, గొల్లపూడిలోని హోల్ సేల్ మందుల దుకాణాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాసవి ఫార్మా కాంప్లెక్స్‌లో జరిపిన తనిఖీల్లో లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రాండెడ్ పేరుతో నకిలీ మందులను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఈ ఔషధాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు తేల్చారు. హోల్ సేల్ వ్యాపారులు (Wholesalers) బిల్స్ లేకుండా మందులు కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఔషధాలను విజయవాడ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి దుకాణాలకు విక్రయించినట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. వీటిలో గుండె సంబంధిత వ్యాధులకు వినియోగించే ఔషధాలు సైతం ఉన్నాయని సమాచారం. ఔషధాల శాంపిల్స్ (Drug samples)ను పరీక్షల నిమిత్తం అధికారులు ల్యాబ్‌కు పంపగా.. ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఫలితాల ఆధారంగా బాధ్యులపై పూర్తి స్థాయి చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల తెలంగాణాలో భారీగా నకిలీ మందుల రాకెట్ (Counterfeit drugs racket) బయటపడింది. ఈ సమాచారంతో అధికారులు రాష్ట్రంలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు ఇలా పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.