భయపెట్టి రాజకీయాలు చేయలేరు.. ఇప్పటికైనా కనువిప్పు కలగాలి: టీడీపీ నేత పయ్యావుల - ఏపీ వార్తలు
Payyavula Keshav Interview: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయంపై.. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. గిట్టనివారిపై కేసులు పెట్టించే అధికారం వైఎస్సార్సీపీదా, టీడీపీదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టులు, డబ్బులు ఇచ్చేది అధికారంలో ఉన్నవారే కదా..! అని ప్రశ్నించారు. ఆత్మపరిశీలన చేసుకోకుండా బురద చల్లితే ఇలాంటి తీర్పులే చూస్తారని ఆయన హితవు పలికారు.
ప్రేమతో తప్ప భయపెట్టి రాజయకీయాలు చేయలేరని జగన్ తెలుసుకోవాలని చురకలంటించారు. రాష్ట్ర భవిష్యత్ కాపాడుకోవాలనే వాతావరణానికి ప్రతీకే.. టీడీపీ విజయాలు అని చెప్పారు. అధికారంలో లేని తామెలా.. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టగలం అని.. పయ్యావుల కేశవ్ నిలదీశారు. అనురాధ గెలుపుతో టీడీపీ.. బీసీ వర్గానికి ఇస్తున్న ప్రాముఖ్యతను తెలియజేస్తోందని అన్నారు. అదే విధంగా ఒక మహిళకు సీటు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ఆలోచనా ధోరణికి సంకేతమని పేర్కొన్నారు. జగన్‌కు ఇప్పుడైనా కనువిప్పు కలగాలంటున్నారు పయ్యావుల కేశవ్.