Ex MP Chinta Mohan Fires on YSRCP Govt: చంద్రబాబును జైల్లో పెట్టి ఏం సాధించారు..? కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి: చింతా మోహన్ - వైసీపీ ప్రభుత్వంపై చింతా మోహన్ కామెంట్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 1:12 PM IST
Ex MP Chinta Mohan Fires on YSRCP Govt: రాష్ట్రంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని.. కక్షపూరిత రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారడం దారుణమని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులు పోలీస్ సర్వీస్ కాకుండా పొలిటికల్ సర్వీస్ అధికారులుగా తయారయ్యారన్నారు. దాదాపు 50 రోజులుగా చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు తప్పు అని కచ్చితంగా చెబుతానని అన్నారు. ఇన్ని రోజులైనా... డబ్బులు ఏమైనా చంద్రబాబు ఖాతాల్లోకి వచ్చాయని నిరూపించగలిగారా..? అని నిలదీశారు.
జైల్లో నుంచి చంద్రబాబు లేఖ రాయడం పెద్ద తప్పిదం అన్నట్లుగా జైలు అధికారులు ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ జైలు నుంచి లేఖలు రాసిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం మార్గదర్శి, రామోజీరావుపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చింతా మోహన్ అన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ప్రతిఒక్కరూ నిరసిస్తున్నారని తెలిపారు. ఇకనైనా జగన్ కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.