"రైతులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది - ప్రభుత్వం 103 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది" - EX Minister Somireddy Latest Comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2023, 5:10 PM IST
EX Minister Somireddy on Drought in AP: రాష్ట్రంలో తీవ్రమైన కరవు నెలకొంటే ప్రభుత్వం కేవలం 103 మండలాలను మాత్రమే కరవు ప్రాంతాలుగా ప్రకటించడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడం వల్ల రాష్ట్రంలో వరి సాగు తగ్గిందని.. ఇతర పంటలను రైతులు సాగు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులు కరవు తీవ్రతపై కనీసం సమీక్షలు నిర్వహించడంలేదని ఆయన మండిపడ్డారు. కరవుపై వ్యవసాయ మంత్రిని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటున్నారని అన్నారు.
కరవు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడి రైతుల కష్టాలను చూసినప్పుడు కడుపు తరుక్కుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి.. పంటలు ఎండిపోవడంతో రైతులు కూలీలుగా మారారని అన్నారు. రాష్ట్రంలో కరవు లేని జిల్లా లేదని ఆరోపించారు. కడప జిల్లాలో కరవు మండలాలను ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటల సాగు ఇప్పుడు నమోదైనంత తక్కువగా.. గత 50 సంవత్సరాలలో ఎప్పుడూ నమోదు కాలేదని అన్నారు.