Gadapa Gadapa: మాజీ మంత్రి శంకర్ నారాయణకు నిరసన సెగ.. - అంగన్వాడీ కార్యకర్త నిరసన
Ex Minister Shankar Narayana Faced Protest: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నాయకులకు తరచుగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. గ్రామానికి తాగునీరు లేదని, అమ్మఒడి పథకం అందలేదని, జగనన్న విద్యా దీవెన లేదని ఇలా ఏ సమస్య ఉన్న వారు ఆ సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీస్తునే ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి శంకర్ నారాయణకు శ్రీ సత్యసాయి జిల్లాలో చుక్కెదురైంది. అంగన్వాడీ కార్యకర్త విధుల నుంచి తనను తొలగించరంటూ.. ఓ మహిళ శంకర్ నారాయణను నిలదీసింది. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించి.. తన నోరు కొట్టారని మంత్రికి శాపనార్థాలు పెడుతు కన్నీటి పర్యంతమైంది.
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని మల్లాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని భూగానపల్లిలో.. మాజీ మంత్రి శంకర్ నారాయణ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో భారతి అనే మహిళ ఆరు నెలల క్రితం తనను అంగన్వాడీ కార్యకర్త విధుల నుంచి తొలగించారని శంకర నారాయణను అడ్డుకుంది. తనపై కక్షగట్టి తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేసి.. చివరకు ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. పది సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న తనను విధుల నుంచి తొలగించి.. తనకు అన్యాయం చేశారని కన్నీటి పర్యంతమైంది. అంతే కాకుండా తనను విధుల నుంచి తొలగించారని మాజీ మంత్రికి శాపనార్థాలు పెట్టింది.