Ex Minister Ganta on CM Jagan : ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ మార్కు పరిపాలన ఆరంభం.. విశాఖకు వస్తే ఒరిగేదేమీ లేదు : గంటా - సీఎం జగన్‌పై విమర్శలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 7:12 PM IST
Ex Minister Ganta on CM Jagan Came to Visakha: ఈ 100 రోజులకు జగన్ విశాఖకు వచ్చి పరిపాలన చేస్తే ఒరిగేదేమి లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖలోని అంబేద్కర్ భవన్లో 'సేవ్ డెమోక్రసీ ఇన్ డేంజర్' అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ అధికారం చేపట్టి 4సంవత్సరాల 7 నెలలు కావస్తోందని.. నాలుగున్నర సంవత్సరాలు విశాఖలో ప్రశాంతమైన వాతావరణం పోయిందని ఆరోపించారు. కబ్జాలు, మాఫియాలు కిడ్నాప్‌లు పెరిగిపోయి.. అరాచక పాలన చూశామని వ్యాఖ్యానించారు.
విశాఖలో సాక్షాత్తు వైసీపీ ఎంపీ కుటుంబమే కిడ్నాపై.. వారు రెండు రోజులు ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అధికార పార్టీ వారికి రక్షణ లేక రాష్ట్రంలో అయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర మంత్రే రాష్ట్రంలో రాజకీయం భయంకర పరిస్థితిలో ఉందని అన్నారని గుర్తు చేశారు. జగన్ విశాఖ రావటంపై.. ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలని.. అభిప్రాయ సేకరణలో ఏ ఒక్కరూ జగన్ విశాఖ రాకను ఆహ్వానించటం లేదని స్పష్టమవుతుందన్నారు. ధర్మం నాలుగు కాళ్లపై నడవాల్సి ఉండగా.. జగన్ పాలనలో ఒక్కో కాలు విరిగిపోయి కుంటి కాలుతో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్రంలోని పరిణామాలు చూస్తుంటే ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.