"సీఐ గారు తమాషా చూస్తున్నారా.. లాగేయండి..".. మాజీ మంత్రి అవంతి ఆగ్రహం - యువతపై మాజీ మంత్రి అవంతి ఆగ్రహం
EX MINISTER AVANTI COMMENTS ON YOUTH: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నోటి దురుసుతనం మరోమారు బయటపడింది. గతంలో 'అరే పంతులు' అంటూ రాష్ట్రవ్యాప్త చర్చకు తావిచ్చిన అవంతి మరోమారు అదే తీరును ప్రవర్తించారు. 'ఏవండి సీఐ గారు.. ఏం చేస్తున్నారు.. తమాషా చూస్తున్నారా.. లాగేయండి. ఎవడ్రా అసలు.. యూస్ లెస్ ఫెలో' అంటూ మరోసారి అసహనానికి గురయ్యారు. ఈ సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. భీమునిపట్నం మండలం చిప్పాడ గ్రామంలో వైఎస్సార్ ఆసరా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, నియోజవర్గ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) హాజరయ్యారు.
ఈ క్రమంలో స్థానిక యువత ఉద్యోగ కల్పన కోసం పట్టుబట్టారు. అవంతితో వాగ్వాదానికి దిగడంతో ఆయన ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏ అమ్మాయి .. మీరు ఎవరైనా కానీ మాట్లాడకండి. చెప్పింది వినండి. గ్రామం అంటే ఓ పద్ధతి ఉంటుంది. సర్పంచ్‌గా పోటీ చేసే ఓడిపోయిన వ్యక్తి, సర్పంచుగా గెలిచిన మరో వ్యక్తి ఉన్నారు. దరఖాస్తులు వాళ్లకు ఇస్తే వారు నాకు చేరవేస్తారు. నా ద్వారా కంపెనీకి పంపిస్తాను. రోడ్ల మీదకు వస్తే ఉద్యోగాలు రావని గుర్తుపెట్టుకోవాలి' అని వేదిక మీద నుంచి కిందకు దిగిపోయారు. అనంతరం దివిస్ ఆర్థిక సహాయంతో పాఠశాలలకు మినీ ఆర్వో ప్లాంట్లు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.