వాలంటీర్ వ్యవస్థ మాటున ప్రజాస్వామ్యానికి తూట్లు - ఏపీ ఓటరు జాబితాలో అవినీతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 10:24 PM IST
Prathidwani: రాష్ట్రంలో ఓటు చరిత్రలో అతిపెద్ద కుట్ర జరుగుతోందా. ప్రజల సేవ కోసమని తీసుకు వచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనం నుంచి వేతనాలు చెల్లిస్తున్న.. వాలంటీర్ వ్యవస్థే అందుకు పావుగా మారుతోందా. కొద్దిరోజులుగా ఇదే విషయంలో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ఓటర్ల జాబితాకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలనే ఉదాహరణగా చూపిస్తున్నాయి. ఇదే విషయంలో ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా చేరింది. వాలంటీర్ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని.. వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సుప్రీంలో వ్యాజ్యం దాఖలైంది. వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే అని వైసీపీ లీడర్లే పచ్చిగా చెప్పిన సందర్భాలున్నాయి. వైసీపీ లోకల్ లీడర్లకు నచ్చితే వాలంటీరు తన పోస్టులో ఉంటాడని.. లేకపోతే పీకి పారేస్తామని అన్న సందర్భాలు కొకోల్లలు. అలాంటి వారి వద్ద ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఉంచటం ఎంతవరకు శ్రేయస్కరం. వైసీపీ కార్యకర్తలుగా చెబుతున్న వారికి ఎన్నికల విధులు అప్పగించటం ప్రజాస్వామ్యమేనా. పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది. జగన్ ప్రభుత్వం ఏం చేస్తోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.