నాడు మద్యపాన నిషేధం అని.. నేడు బడ్జెట్లో లెక్కలు.. మాట తప్పింది ఎవరు? - PRATHIDWANI DEBATE
Liquor ban in Andhra Pradesh: రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తెస్తామన్నారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని అన్నారు. విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పదేపదే అదే చెప్పారు, హామీ ఇచ్చారు. అక్కడ సీన్ కట్ చేస్తే.. కాలం గిర్రున తిరిగింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఏం చేశారు? ఇటీవల ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ఆదాయం లెక్కలు దేనికి సంకేతం? మాట తప్పేది లేదు.. మడం తిప్పేది లేదు అన్న జగన్మోహన్ రెడ్డి.. నాటి మాటలకు. నేటి చేతలకు పొంతన ఎక్కడ?
3 దశల్లో కచ్చితంగా ఊర్లలో మద్యం షాపే లేకుండా.. చేస్తామని విపక్షంలో ఉండగా హామీ ఇచ్చిన జగన్ వెయ్యిమంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలో పదిమంది.. మహిళా పోలీసుల్ని పెట్టి సారాయి, బెల్టుషాపు నిరోధిస్తామన్నారు. తాగుడు అనేది లేకుండా పోయిన రోజే ప్రతి కుటుంబంలో.. ప్రేమ, అప్యాయతలు వెల్లివిరిసేదని నాడు ఎంతో ఆవేదన చెందారు. కాగా దశల వారీ విధానంలో మద్యపాన నిషేధం చెప్పి.. 4వ ఏడాదీ వచ్చేసింది. మరి కొన్ని నెలల్లో ఎన్నికల ముందు నిలిచిన రాష్ట్రంలో.. మద్యనిషేధం ఆనవాళ్లు ఏమైనా కనిపిస్తున్నాయా? మద్యపాన నిషేధం తీసుకుని రాకపోతే అయిదేళ్ల తర్వాత ఓట్లు అడగబోమని ప్రతిపక్ష నేతగా అన్న జగన్.. అదే విషయం మానిఫెస్టోలోనూ పేర్కొన్నామన్నారు. మరిప్పుడు ప్రజలకు మద్యనిషేధంపై ఏం చెబుతారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.