PRATHIDWANI: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు.. ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నాయి..! - ప్రతిధ్వని వీడియోలు
ఒకవైపు వారి అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అందించిన ఉత్సాహం.. మరోవైపు సవాల్ విసురుతున్న 2024 సార్వత్రిక ఎన్నికల లక్ష్యం. ఈ రెండింటి మధ్యనే శతాధిక కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన ప్లీనరీ సమావేశాలు.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏకంగా 15వేల మంది ఇందులో పాల్గొంటున్నారని కాంగ్రెస్‌పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అంతా ఎదురు చూస్తున్నట్లు... ఇక్కడే 2024 ఎన్నికలకు రోడ్‌మ్యాప్, పొత్తులు, ఇతర సర్దుబాట్ల అంశాలపై పార్టీ వ్యూహ ప్రణాళికలు సిద్ధం అవుతాయా? హ్యాట్రిక్ మీద కన్నేసిన కమలం పార్టీని దీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ అధిగమించాల్సిన సవాళ్లేమిటి?
పదిహేను వేలమంది ప్రతినిధులు.. 3రోజుల మేధోమథనం. కాంగ్రెస్‌పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు జరుగుతున్నాయి. నాయకత్వ లేమి, ఎన్నికల్లో ఓటమి, అంతర్గత విబేధాలు, భాజపాతో పాటు సవాల్‌గా మారిన ప్రాంతీయ పార్టీలు. ఈ అంశాలపై కాంగ్రెస్ ప్లీనరీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందా. మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు దేశంలో లేడనే ప్రచారానికి సమాధానం ఈ ప్లీనరీ ఇవ్వగలుగుతుందా.. లోక్‌సభ ఎన్నికల్లో 2దఫాలుగా రెండంకెలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి మూడంకెలు సాధించాలంటే ఏ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.
రానున్న కీలకమైన 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ రోడ్ మ్యాప్, పొత్తులపై వ్యూహం ఎలా ఉండబోయే అవకాశం ఉంది? భాజపా దేశవ్యాప్తంగా బలంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. పరస్పర వైరుధ్యాలతో సతమతం అయ్యే ప్రాంతీయపార్టీలను ఒక తాటిపైకి తెచ్చి కాంగ్రెస్ నాయకత్వం వహించగలదా... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ రోల్ ఏమిటి? ప్రియాంకాగాంధీ పాత్ర ఏమిటి? వారు తమ బాధ్యతల నిర్వహణలో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నారా..? సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలున్నాయి. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? అత్యంత సంక్లిష్టమైన, సవాళ్ల సమయంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు పార్టీకి ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.