Teacher Misbehavior: విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. తల్లిదండ్రుల ఆందోళన - విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్
English Teacher Misbehavior With Students : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకుడిగా మారిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పత్తికొండ మండలం హోసూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు కేవీ రమణ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేశారు. కోపోద్రిక్తులైన విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ఆంగ్ల ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడికి వినతిపత్రం అందజేశారు. తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయుడు సెలవు పెట్టి పాఠశాల నుంచి జారుకున్నాడు.
మీడియాపై వైఎస్సార్సీపీ నేతల దాడి :ఈ ఘటనను కవరేజ్ చేయడానికి మీడియా ప్రతినిధులు పత్తికొండ నుంచి వచ్చారు. నిరసన అనంతరం తిరిగి వెళుతున్న మీడియాపై వైఎస్సార్సీపీ నేతలు దాడిగి దిగారు. ఎందుకు వచ్చారంటూ... దుర్భాషలాడుతూ దాడి చేశారు. కొందరు మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి స్థానిక ప్రజలు అడ్డుకుని మీడియా ప్రతినిధులను కాపాడారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.