సభలో ఇబ్బందులు.. ప్రారంభానికి ముందే జారుకున్న జనం.. ఖాళీగా కుర్చీలు
empty chairs in ysr-rythu-bharosa: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో రైతులు ఆపసోపాలు పడ్డారు. సమావేశం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. మార్కెట్ యార్డులోని రేకుల షెడ్డులో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సతమతమయ్యారు. కనీసం ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడం, మంచి నీళ్లు లేక రైతులు విలవిల్లాడారు. చేతి రుమాళ్లు, తువ్వాళ్లతో విసురుకుంటూ కనిపించారు. ఉక్కపోత, ఫ్యాన్లు లేకపోవడంతో రైతులు, మహిళలు కార్యక్రమం ప్రారంభం కాకముందే ప్రాంగణం నుంచి వెనుతిరగడంతో ఖాళీ కుర్చీలు మిగిలాయి. బయటకు వెళ్లిన రైతులను సమావేశానికి రావాలంటూ వైఎస్సార్సీపీ నేతలు మైక్‌లో పిలిచినా.. వారు వెళ్లిపోవడం కొసమెరుపు.
ఇదిలా ఉండగా సమావేశం ప్రారంభ సమయం పది గంటలని అధికారులు తెలపగా.. రైతులు 9 గంటలకే సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. 11 గంటలు దాటినా సమావేశం ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశం మధ్యలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్లో మాట్లాడారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత విద్యుత్ పునరుద్ధరించారు.
TAGGED:
YSR Rythu Bharosa