Elephant Attack on Bus: మన్యం జిల్లాలో బస్సుపై ఏనుగు దాడి.. భయాందోళనతో ప్రయాణికుల పరుగులు - మన్యం జిల్లాలో బస్సుపై ఏనుగు దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 5:01 PM IST
Elephant Attack on Bus in Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఆర్తాం రహదారిలో ఏనుగు బీభత్సం సృష్టించింది. రహదారిలో వెళ్తున్న బస్సుపై ఏనుగు దాడి చేయగా బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. నడిరోడ్డులో నిల్చొని హల్చల్ చేయడంతో స్థానికులు భయభ్రాంతులతో పరుగులు తీశారు. పది రోజుల క్రితం గుంపు నుంచి విడిపోయిన ఏనుగులు, అటవీ ప్రాంతాన్ని వీడి.. జనసమూహాల్లో సంచరిస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగు రహదారిపై హల్చల్ చేసింది. ఈ క్రమంలో ఎదురొచ్చిన వాహనాలు, ప్రయాణికులపైనా దాడులకు యత్నించింది.
ఈ రోజు ఉదయం కొమరాడ మండలం అర్తాంలో ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి పార్వతీపురం వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును అడ్డగించింది. అంతటితో ఆగకుండా.. అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.. పరుగులు తీశారు. గత పది రోజుల నుంచి ఒంటరి ఏనుగు జనావాసాల్లో తిరుగుతూ దాడులకు పాల్పడుతుండటంతో.. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగు నుంచి ఏ సమయంలో ఎలాంటి ముప్పు సంభవిస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మన్యం జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.