షాక్ కొడుతున్న విద్యుత్ స్తంభాలు.. భయాందోళనలో ప్రజలు - ఇనుప విద్యుత్ స్తంభాలు
Electricity Transmission through Iron Poles: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో చిన్నపాటి వర్షానికి విద్యుత్ స్తంభాలకు విద్యుత్ ప్రసరించడంతో ప్రజలు భయపడుతున్నారు. ఏ సమయంలో ఎవరికి షాక్ కొడుతుందో అని వణికిపోతున్నారు. చిన్న వర్షం పడినా సరే విద్యుత్ స్తంభాలు షాక్ కొడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో అటుగా వెళ్లే స్థానికులు, గ్రామీణ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
మరీ మఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే కొట్ల బజారు ప్రాంతంలో ఇనుప స్తంబాలే ఇప్పటికీ ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇనుప స్తంభానికి విద్యుత్ ప్రసరిస్తూ పలువురికి షాక్ కొట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉండే ప్రజలు ఏ సమయంలో.. ప్రమాదం జరుగుతుందో అని నిత్యం ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి షాక్ కొడుతున్న ఇనుప విద్యుత్ స్తంభాలను పరిశీలించాలని.. మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్వి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.