ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రుషికొండపై విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

ETV Bharat / videos

Sub Station on Rushikonda: రుషికొండ నెత్తిన మరో బండ.. విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు యత్నం

By

Published : Jul 23, 2023, 7:38 AM IST

Electricity Sub Station on Rushikonda: పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో విశాఖలోని రుషికొండపై నిర్మిస్తున్న భారీ నిర్మాణాలపై విమర్శలు వస్తున్నా.. వైసీపీ సర్కార్‌ వెనక్కు తగ్గడం లేదు. రుషికొండపై తీరప్రాంత పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కొంతకాలంగా విపక్షాలు ఆందోళన చేస్తున్నా.. న్యాయస్థానాల్లోనూ కేసులు నడుస్తున్నా.. ఇవేవీ పట్టించుకోకుండా పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మాణాలను కొనసాగిస్తోంది. తాజాగా ఆ కొండపై విద్యుత్తు సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

ఎక్కడైనా భవనాలు నిర్మిస్తే వాటి విద్యుత్తు అవసరాలకు సరిపడ ట్రాన్స్‌ఫార్మర్లనే ఏర్పాటు చేస్తారు. రుషికొండలో మాత్రం 10 మెగావోల్ట్‌ యాంప్‌ సామర్థ్యంతో కూడిన సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. అంతరాయాలు లేని సరఫరా కోసం ప్రత్యేకంగా భూగర్భ విద్యుత్తులైన్‌ నిర్మించనున్నారు. ఇందుకు అంచనాలు రూపొందించారు. పైకి చెబుతున్నట్టు పర్యాటక శాఖ హోటళ్లు, రిసార్టుల కోసమైతే ఇంత హడావుడి అవసరం లేదు. 

త్వరలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇక్కడినుంచే నిర్వహించనున్నారనే ప్రచారం జరుగుతున్నందున.. ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. రుషికొండపై సబ్‌స్టేషన్‌ కోసం స్థలాన్ని తీసుకుంటే ఇబ్బందులు ఎదురవ్వొచ్చని భావించి.. 'కంటైనర్‌ విద్యుత్తు సబ్‌స్టేషన్‌'ను అమర్చనున్నారు. ఇందుకు సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకూ నిధులను వెచ్చించనున్నారు. దీని నిర్మాణ బాధ్యతలనూ ముఖ్యమంత్రి సన్నిహితుడు విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు అప్పగించినట్లు సమాచారం.

విద్యుత్తు పంపిణీ పునర్వ్యవ్యవస్థీకరణ పథకం కింద ఈపీడీసీఎల్‌ పరిధిలోని విశాఖ సర్కిల్‌లో వివిధ కేటగిరీ పనులకు 15 వందల 52 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. ఇందులో వెయ్యి కోట్లు నగరంలో భూగర్భ విద్యుత్తు పనులకే కేటాయించి.. లోగడ టెండర్లు పిలిచారు. ఇవి కార్యరూపంలోకి రాకముందే 'ఇంప్రూవ్‌మెంట్స్‌' పేరుతో ఈపీడీసీఎల్‌ సొంతంగా 14.73 కోట్ల రూపాయలతో 10.5 కి.మీ. మేర భూగర్భ విద్యుత్తు పనులకు సిద్ధమవుతోంది. 

హనుమంతువాక కూడలికి సమీపంలోని డెయిరీఫాం 220 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి సాగర్‌నగర్‌కు సమీపంలోని ఏబీనగర్‌ సబ్‌స్టేషన్‌ వరకు ఈ ప్రత్యేక లైన్‌ నిర్మించనున్నారు. దీనిద్వారానే రుషికొండపై నిర్మాణాలకు అంతరాయాలు లేని 24 గంటల విద్యుత్తు ఇవ్వనున్నారు. అయితే ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో ఓ వైపు భూగర్భ విద్యుత్తు పనులకు సిద్ధమవుతుండగా.. అదే పనికి ఈపీడీసీఎల్‌తో 14 కోట్ల 73 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించడంపై విమర్శలొస్తున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details