Electricity Smart Meters 'విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో జగన్ భారీ కుంభకోణానికి తెరలేపారు'
Electricity Smart Meters: విద్యుత్ స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇది మరో 2జీ స్కామ్‌గా అభివర్ణించారు. విద్యుత్ సంస్కరణలు, ప్రజలపై భారాలు అనే అంశంపై విజయవాడ దాసరి భవన్లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సోమిరెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి, సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రాన్సుపార్మర్ల ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. యూపీలో స్మార్ట్ మీటర్ ఏర్పాటుకు 3 వేల 932 రూపాయలు అంగీకారం కుదిరితే.. రాష్ట్రంలో మాత్రం గుత్తేదారుకు 36 వేల 932 రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్దమైందని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిందని గుర్తుచేసిన సోమిరెడ్డి.. వైసీపీ ప్రభుత్వం భారీమూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇవ్వడం తథ్యమని అభిప్రాయపడ్డారు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతుందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.