Electric shock to girl students: ఎలక్ట్రీషియన్ సరదా.. ముగ్గురు విద్యార్థినులకు విద్యుత్ షాక్ - ఈడుపుగల్లు పాఠశాల
Electric shock to girl students: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామ జడ్పీ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు ఎలక్ట్రీషియన్ విద్యుత్ షాక్ ఇచ్చి వేధించడం ఆలస్యంగా వెలుగు చూసింది. గురువారం పాఠశాలలో క్లాస్ రూమ్‌కి టీవీలు అమర్చడంతో పాటు స్విచ్ బాక్సులు ఏర్పాటు చేసేందుకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎలక్ట్రీషియన్‌ను నియమించారు. సంబంధిత ఎలక్ట్రీషియన్ తన సహాయకులతో పాఠశాలకు వచ్చి పని ప్రారంభించాడు. దీనిలో భాగంగా పదో తరగతి బి సెక్షన్ లో పనులు చేసే క్రమంలో.. ఓ సహాయకుడు విద్యుత్ వైర్లను విద్యార్థులు కూర్చున్న బల్లలకు తగిలించి.. షాక్ కొట్టిందా? అంటూ పలుమార్లు ఎగతాళి చేశాడు. దీంతో ముగ్గురు విద్యార్థినులు స్వల్పంగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వీరిలో ఓ విద్యార్థిని ముఖం కడిగేందుకు బయటకు వెళ్తూ.. మార్గమధ్యలో పడిపోయింది. మిగిలిన ఇద్దరు విద్యార్థినులు చేతులు నొప్పులు పెడుతున్నాయని ఉపాధ్యాయులకు చెప్పగా వారు వచ్చి దగ్గరలోని ఓఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత పాఠశాలకు పంపగా ఉపాధ్యాయ సిబ్బంది దీనిని చిన్న విషయంగా పరిగణలో తీసుకుని వదిలేశారు.
ఇదిలా ఉండగా, సాయంత్రానికల్లా ఇంటికెళ్లిన ఓ విద్యార్థిని విద్యుత్ షాక్ కొట్టిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కంకిపాడు మండల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం ఉదయం అప్రమత్తమైన సంబంధిత ఎంఈఓ ప్రసాద్.. విద్యత్ షాక్ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయిని పద్మావతీ బాయి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈడుపుగల్లు పాఠశాల సాధారణ పరిశీలనకై వెళ్తున్నానని చెప్పగా... అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు అప్పటికప్పుడు బయల్దేరి పాఠశాలకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన అధికారులు పాఠశాల సిబ్బందిని విచారించగా.. విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో తాము స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పాఠశాలలో పని చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ విద్యార్థినులకు షాక్ ఇచ్చినట్లు తమకు తెలియదని చెప్పారు. అనంతరం సంబంధిత ఎలక్ట్రీషియన్‌ను పిలిచి విచారించారు. అధికారులు గట్టిగా నిలదీయడంతో.. విద్యార్థుల హుషారు నచ్చటంతో తాను సరదాగా ఆటపట్టించానని,.. అది వారికి ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. దీంతో మండల విద్యాశాఖ అధికారి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత ప్రధానోపాధ్యాయురాలిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.