Lokesh Egg Case: లోకేశ్‌పై గుడ్ల దాడి ఘటన.. పరస్పర కేసులు నమోదు - ప్రొద్దుటూరు లేటెస్ట్ న్యూస్
Lokesh Egg Case: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై గుడ్లు విసిరిన ఘటనలో ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల ఒకటో తేదీన మైదుకూరు రోడ్డు మార్గంలో లోకేశ్ పాదయాత్ర సాగుతుండగా ఇద్దరు ఆకతాయిలు కోడి గుడ్డు విసిరిన సంగతి తెలిసిందే. వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే లోకేశ్ పాదయాత్రలో ఎందుకు కేకలు వేస్తున్నారని ప్రశ్నించినందుకు.. తనపై టీడీపీ నేతలు దాడి చేశారని.. మోడంపల్లికి చెందిన శివప్ప అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కాగా పరస్పర ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ యాత్రలో యువత, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రారంభించిన ఈ యాత్ర నేటితో.. 116వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.