Farmer Talent: రైతు ఐడియా అదిరింది.. అందర్నీ ఆలోచింపజేసింది.. - Gokavaram farmer innovative idea
Innovative thinking of the farmer: వర్షాలు ప్రారంభం కావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ దుక్కు దున్నే పనులతో ట్రాక్టర్లు బిజీగా మారాయి. ఒక పొలం నుంచి మరో పొలానికి వెళ్లాలంటే ప్రధాన రహదారులపై ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఇనుప చక్రాలు తీసి.. మరల పొలంలోకి వెళ్లిన తరువాత బిగించాలి. ఈ విధంగా చక్రాలు తీసి బిగించేందుకే సమయం పడుతుండడంతో చాలామంది నిర్లక్ష్యంతో నేరుగా ఇనుప చక్రాలతోనే రోడ్లపై ట్రాక్టర్లను పరుగులు తీయిస్తున్నారు. దమ్ము చక్రాల కింద నలిగి రోడ్లు చాలా వరకు ధ్వంసం అవుతున్నాయి. అధికారులు కేసులు నమోదు చేస్తున్నా ట్రాక్టర్ యజమానులలో ఏటువంటి మార్పు రావడం లేదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వినూత్నంగా ఆలోచించాడు ఓ రైతు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం చెందిన రైతు తన ట్రాక్టర్ దమ్ము చక్రాలు రోడ్డుపై పడకుండా మరో ట్రాక్టర్కు కట్టి తీసుకువెళ్లాడు. రోడ్లపై ఇనుప చక్రాలు పడకుండా వెళుతున్న ట్రాక్టర్ను స్థానికులు ఆసక్తిగా గమనించారు. ప్రతి ఒక్కరూ ఈ రైతు మాదిరిగా బాధ్యతగా ఆలోచిస్తే రోడ్లు పాడు కావని స్థానికులు అంటున్నారు. రైతు చేసిన వినూత్న ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు.