ఇంటర్నెట్లో చూసి ఇంట్లోనే డ్రగ్స్ తయారీ - ముఠాను అరెస్టు చేసిన పోలీసులు - drugs making gang in nellore
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 2:32 PM IST
Drugs Gang Arrested in Nellore: నెల్లూరు గ్రామీణ పోలీసులు డ్రగ్స్ తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ కె.తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా చెందిన పి.సాత్విక్ బీటెక్ చదివి, పలు ప్రాజెక్టులు చేశాడు. ఆశించిన డబ్బులు రాకపోవడంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈ క్రమంలో సీహెచ్ శ్రీనివాసులు, మల్లి బాబు, కుంటాల వెంకయ్య, వినోద్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అదే విధంగా సాత్విక్‌కు నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పి.వేణుగోపాల్‌రెడ్డి అలియాస్ వేణురెడ్డి పరిచయం. ఆరు నెలల క్రితం వేణుగోపాల్‌రెడ్డి, నిషేధిత మత్తు పదార్థాలైన మెఫేడ్రోన్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వాటిని తయారుచేసి ఇస్తే కమీషన్ ఇస్తానని సాత్విక్‌కు ఆశ చూపాడు.
ఇదే విషయాన్ని ఇతరులకు సాత్విక్ చెప్పగా, వారు సైతం తయారీకి అంగీకరించారు. ఇంటర్నెట్లో మత్తు పదార్థాలు ఎలా తయారు చేయాలి? ఏయే వస్తువులు అవసరమో తెలుసుకున్నారు. తయారీకి అవసరమైన యంత్రాలు కొనుగోలు చేశారు. నెల్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. దీనిపై పోలీసులకు అందిన సమాచారం మేరకు, వారు ఉండే ఇంటిపై దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 15లక్షల విలువైన 560 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాలు, తయారీకి ఉపయోగించే వస్తువులు, ఫోన్లు, రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.