Workers Agitation: 'నాలుగేళ్లుగా నానావస్థలు''.. కలెక్టరేట్ ఎదుట కార్మికుల రిలే దీక్షలు..
Drinking Water Schemes Workers Agitation: గ్రామీణ తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులు వేతన బకాయిల కోసం ఆందోళన బాట పట్టారు. నాలుగేళ్లుగా సకాలంలో వేతనాలు రాకపోవటంతో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,600 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న శ్రీ సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల్లో వెయ్యిమంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో సత్యసాయి నీటి పథకాన్ని ఎల్ అండ్ టీ సంస్థ పర్యవేక్షణలో తాగునీరు సరఫరా చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎల్ అండ్ టీకి బిల్లులు బకాయి పడటంతో కార్మికులకు ఆ కంపెనీ.. కొద్ది నెలల వేతనాలు సొంతంగా ఇచ్చింది. అయితే ఈ బకాయిలు పెరిగిపోవటంతో తాము నిర్వహించలేమని ఆ సంస్థ తప్పుకుంది. దీంతో కార్మికులకు ప్రభుత్వం వేతనాలు సకాలంలో చెల్లించటంలేదు. ఈపీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపులు చేసినప్పటికీ వాటిని సకాలంలో ఆయా సంస్థలకు జమచేయకపోవటంతో కార్మికులు ప్రయోజనాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయినా ప్రభుత్వం.. కార్మికుల వేతనాలు, ప్రయోజనాలు సమకూర్చటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రెండు తాగునీటి పథకాల కార్మికులు నాలుగు రోజులుగా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. వేతన బకాయిలు, ఇతర డిమాండ్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న తాగునీటి పథకాల కార్మికులతో ఈటీవీ ముఖాముఖి..