Water problem: నీళ్లు లేక రోడ్డెక్కిన మహిళలు.. ఖాళీ బిందెలతో ధర్నా - AP Latest News
ప్రజా ప్రతినిధులు, అధికారులు తాగునీటి సరఫరాను మెరుగు పరుస్తున్నామని.. ఇంటింటికి తాగునీటి కొళాయిని అందిస్తున్నామని చెప్తున్నారు. కాని ఆచరణలో మాత్రం అడుగుపడటం లేదు. అధికారుల మాటలకు పొంతన లేకుండా పోతోంది. ప్రజలు బిందెడు నీటి కోసం.. బండెడు కష్టాన్ని పడాల్సి వస్తోంది. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలో మహిళలు, ప్రజలు రోడ్డెక్కారు. తమ గ్రామంలో నీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో రహదారిపై ధర్నాకు దిగారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట రహదారిపై దాదాపు రెండు పాటు నిరసన వ్యక్తం చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామంలో అరకొరగా వస్తున్న నీటి ట్యాంకర్లు కూడా బిల్లులు రాలేదని నిలిపివేశారన్నారు. సుమారుగా 6 నెలలుగా తీవ్రమైన నీటి సమస్య ఉన్నా ఏ అధికారి పట్టిచుకోలేదని వాపోయారు. తమ నియోజకవర్గానికి పేరుకే మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారే గానీ.. ఏనాడూ తమ సమస్యలు పట్టిచుకున్న పాపాన పోలేదన్నారు. మంత్రి తీరుపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా ముందు మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు.