Water Problem: సీఎం పర్యటనకు ఏర్పాట్లు.. వాటర్ పైపులైన్ పగిలి ప్రజలకు ఇక్కట్లు - AP Latest News
Drinking water Pipeline Damaged: తిరుపతి జిల్లా వెంకటగిరిలో 10 వార్డులకు తాగు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ నేతన్న నేస్తం నిధులను వెంకటగిరిలో విడుదల చేయనున్నారు. అనంతరం పట్టణంలో దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందులో భాగంగా జనార్దన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్థలంలో విద్యుత్ స్థంభం ఉండటంతో దానిని పక్కకు జరిపి వేరే ప్రదేశంలో ఏర్పాటు చేస్తుండగా.. అక్కడే ఉన్న మంచినీటి పైప్ లైన్ ధ్వంసమైంది. దీనితో పట్టణంలోని బంగారుపేట, పాల కేంద్రం ఏరియా, బొప్పాపురం, ఎన్టీఆర్ కాలనీ, ఉపాధ్యాయనగర్ మొత్తం కలిపి 10 వార్డులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నీళ్లు లేక స్థానికులు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న సచివాలయ కార్యాలయ భవనానికి ఆనుకుని ఉన్న పైపు ధ్వంసమైనా అధికారులు ఎలాంచి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు పగిలిన పైపు దగ్గర అధికారులు మరమ్మతులు సాగిస్తున్నా.. పైపు లైన్ నుంచి నీళ్లు బయటకు రావడం వల్ల వాటిని పూర్తిగా బయటకు తొలగించి వెరే పైప్ లైన్ వేయాల్సి ఉంది.
చెట్ల కొమ్మలను సైతం తొలగింపు.. సీఎం పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా దూరంగా ఉన్న చెట్ల కొమ్మలను పూర్తిగా కత్తిరించడంతో మోడుగా మారాయి. త్రిభువని కూడలిలో ప్రాంతంలో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విగ్రహావిష్కరణలో సీఎం పాల్గొననుండటంతో ఈ పరిసర ప్రాంతాల్లోని చెట్లను పూర్తిగా తొలగించారు. సచివాలయ సమీపంలో ఉన్న కానుగ చెట్టును కూకటివేళ్లతో సహా పెకిలించి శ్మశానంలో పడేశారు. మరోవైపు రోడ్డు మార్గంలో చిరువ్యాపారులు ఉండే ప్రాంతంలో చెట్లను తొలగించడంపై స్థానికులు ఆవేదన చెందారు. డివైడర్ మధ్యలో, క్రాస్‌రోడ్డు వరకు రోడ్డు వారగా ఉన్న కొమ్మలను తొలగించారు. మొత్తమ్మీద సీఎం రాకతో పట్టణ పరిధిలో వృక్షాలకు విలాపం తప్పలేదు.