Drama Competitions: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నాటిక పోటీలు - బాపట్లలో జాతీయ స్థాయి నాటక పోటీలు
Drama Competitions: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు ముగిశాయి. సమాజంలో నేటి యువత పోకడను ఎండగడుతూనే.. సరిదిద్దుకునేందుకు నాటికలతో కళాకారులు సందేశమిచ్చారు. కళానికేతన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరిగిన నాటికలు ఆద్యంతం కుటుంబ పరిస్థితులు, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, సంసారం సక్రమంగా సాగేందుకు అనుసరించవలసిన విధానాలపై రచయితలు చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఆలోచింపచేసింది.
చివరిరోజు మూడు నాటికలు ప్రదర్శించారు. అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారు ప్రదర్శించిన "వెండిఅంచులు" నాటికలో.. ఏడు పదుల దాటిన వయసులో ఓ వ్యక్తి.. తన కంటేచిన్నదైన స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు.. ఆమెతో శారీరక సుఖాలను పొందవచ్చు.. కానీ ఆమె గర్భవతై బిడ్డను కనడానికి మాత్రం వీల్లేదని నిర్ణయిస్తారు. స్త్రీల పునరుత్పత్తి హక్కుపై కూడా పురుషుల ఆధిపత్యంపై.. సాగుతుంది ఈ నాటిక. స్వసుఖం కోసం మాత్రమే స్త్రీని వాడుకునే ఓ వ్యక్తి మీద తిరుగుబాటు చేయలేని నిస్సహాయ స్థితిలో స్త్రీ ఎంతకాలం ఉంటుంది. అనే ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించారు.
రెండో నాటిక కళానికేతన్ వీరన్నపాలెం వారు ప్రదర్శించిన.. స్థిరాస్తి, దేవనర్తకి నాటకంలో భవాని పాత్ర ఆద్యంతం నాటకాభిమానులను ఆకట్టుకుంది. నాటిక పోటీల్లో పాల్గొన్న కళాకారులకు నిర్వాహకులు.. బహుమతులు అందచేశారు.