Effect of EENADU Etv Stories: ఈటీవీ కథనానికి స్పందన.. ఆసుపత్రిలో 100 మంచాలు.. - ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు మంచాలు ఏర్పాటు
Beds Arrangement In Government Hospital : అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రి ప్రసూతి విభాగంలో బాలింతలకు మంచాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ప్రతి మంచంపై ఇద్దరు బాలింతలను ఉంచిన దయనీయ పరిస్థితిని 'ఈటీవీ' కథనం ప్రసారం చేసింది. చిన్నపాటి మరమ్మతులు చేస్తే వందకు పైగా మంచాలు వినియోగంలోకి వస్తాయన్న విషయాన్ని కూడా 'ఈటీవీ' స్పష్టం చేసింది. దీనికి స్పందించిన ముగ్గురు దాతలు దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి గుట్టలుగా పడిన మంచాలన్నిటికీ మరమ్మత్తులు చేయిస్తున్నారు. అనంతపురం నగరానికి చెందిన సామాజిక కార్యకర్త అనిల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మనోరంజన్ రెడ్డి, జలవనరుల శాఖ ఇంజనీర్ సుధీర్లు ఆ మంచాలన్నిటిని రిపేర్లు చేయిస్తున్నారు. ఐదుగురు వెల్డర్లను పిలిపించి ఆసుపత్రి ఆవరణలోనే వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు. పడకలు లేక ఇబ్బంది పడుతున్న బాలింతలకు దాతల సహాయంతో దాదాపు 100 మంచాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పనిని దాతలుగా తాము ముందుకొచ్చి చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి ఎమ్మెల్యే కనీసం లక్ష రూపాయలు తమ అభివృద్ధి నిధుల నుంచి ఆసుపత్రికి ఇస్తే నిరుపేద బాలింతలతో పాటు రోగులకు మౌలిక సదుపాయాలు కల్పన చేయచ్చని దాతలు చెబుతున్నారు.