Donkeys Marriage for Rains in Anantapur: అనంతపురం జిల్లాలో వింత ఆచారం.. వర్షాలు పడాలని గాడిదలకు పెళ్లి - farmers Marriage to Donkeys for Good Rain
Donkeys Marriage for Rains in Anantapur: పొలంలో నాగలితో దున్నాలంటే వర్షాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అక్కడి రైతులు వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. మొన్ననే కదా అధిక వర్షాలు పడ్డాయంటారా..? ఆ వానలు వారికి ఉపయోగపడలేదని వారు నిరాశ వ్యక్తం చేశారు. వర్షాల కోసం చెట్లకు పెళ్లిళ్లు చేయడం, కప్పలకు పెళ్లి చేయడం ఇలా ఇతర పద్ధతుల్లో వరుణ దేవుడిని వేడుకోవడం చూశాం. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో వర్షాలు పడాలని రైతులు వరుణ దేవుడిని విచిత్ర పద్ధతిలో తమ కోరికను తెలియజేశారు.
వర్షాలు కురవాలని కోరుకుంటూ అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలోని రైతులు వింత ఆచారాన్ని పాటించారు. రెండు గాడిదలను పూలమాలలతో అలంకరించారు. అనంతరం వాటికి పెళ్లి చేశారు. రెండు గాడిదలను మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగించారు. అక్కడి ఆచారం ప్రకారం గ్రామస్థులు పాల్గొని వాటికి స్వాగతం పలికారు. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్లో విత్తనం వేయలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పదును దాటిన తరువాత వర్షాలు పడటంతో రైతులకు ఉపయోగ పడలేదని వారు అన్నారు. రబీ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా గాడిదలకు పెళ్లి చేసి వర్షాలు కురువాలని వేడుకున్నామని గ్రామస్థులు తెలిపారు.