Dogs Attack: బౌబోయ్ కుక్కలు.. ఒకేరోజు 20 మందిపై దాడి - నెల్లూరు జీజీహెచ్‌లో అందుబాటులో లేని టీకాలు
Dogs Attack : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ సింహాల వీర విహరంతో ప్రజలు పరుగులు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో కుక్క దాడికి ఓ వృద్ధుడు తీవ్రగాయాలపాలై.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. మరోవైపు నెల్లూరులో పిచ్చి కుక్క దాడిలో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. కుక్క దాడితో వారు ప్రభుత్వాసుపత్రికి పరుగులు పెట్టగా.. అక్కడ టీకాలు అందుబాటులో లేక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అసలేం జరిగిందంటే :ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలానికి చెందిన పెద్దవరం గ్రామంలో ఆదివారం సాయత్రం ఓ పిచ్చి కుక్క నలుగురు వ్యక్తులతోపాటు, ఓ గేదెపై దాడి చేసింది. ఈ దాడిలో ఓ వృద్ధుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఒకే గ్రామంలో నలుగురిపై దాడి చేయటంతో గ్రామంలోని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
మరోవైపు నెల్లూరు నగరంలో పిచ్చికుక్క నగర వాసులకు ముచ్చెమటలు పట్టించింది. గాంధీ బొమ్మ, వీఆర్సీ సెంటర్లో విహరిస్తూ.. పాదచారులపై దాడి చేసింది. ఈ దాడిలో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో నగరవాసులు బెంబేలెత్తగా.. కుక్క దాడిలో గాయలపాలైన వారు చికిత్స కోసం జీజీహెచ్‌కు వెళ్లారు. దీంతో అక్కడ 20మందికి సరిపడా టీకాలు లేకపోవటంతో బాధితులు ఇబ్బంది పడ్డారు. టీకాలు అందుబాటులో లేకపోవటంతో.. బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి.. చికిత్స తీసుకున్నారు. దాడికి పాల్పడిన పిచ్చికుక్కను కార్పొరేషన్ సిబ్బంది పట్టుకుని బంధించారు.