Street Dogs Attack: రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. హడలిపోతున్న ప్రజలు - వీధి కుక్కల దాడి
Street Dogs Attack: విజయనగరం జిల్లా రాజాంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. కుక్కలు ప్రతి వీధిలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట కుక్కల దాడిలో ప్రజలు గాయాలపాలవుతున్నారు. తాజాగా రాజాం పురపాలక సంఘం పరిధి పొనుగుటివలసలో.. శాసన లక్ష్మునాయుడుతో పాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మునాయుడు పరిస్థితి విషమంగా ఉండటంతో.. శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
అదే విధంగా రాజాం పట్టణంలో పదేళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన వారంతా.. రాజాం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజాం పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేయడంతో స్థానికులతో పాటు.. వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు దాడులు పెరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన స్పందించి కుక్కల నుంచి తమను కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు.