Velugonda project residents: మా సమస్యలు వదిలేసి ప్రాజెక్టు ఎలా ప్రారంభిస్తారు..?: వెలిగొండ నిర్వాసితులు - వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు
Velugonda project residents: ప్రకాశం జిల్లా కనిగిరిలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందన కార్యక్రమం నిర్వహించగా.. డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి అర్జీదారులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఫిర్యాదులతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ముఖ్యంగా జిల్లాలోని పెదారవీడు మండలంలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు, ఇళ్లను కోల్పోయిన బాధితులు సుమారు 100 మంది వరకు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు మాట్లాడుతూ తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం, సబ్సిడీలు, ఎటువంటి పథకాలు కూడా తమకు వర్తింప చేయలేదని తెలిపారు. వీటన్నింటికీ తోడు ప్రభుత్వం అందిస్తానన్న పునరావాసానికి సంబంధించిన చర్యలను కూడా పూర్తిస్థాయిలో చేపట్టలేదని వారు ఆరోపించారు. అంతేకాక తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టును మూడు నెలల్లో ఎలా ప్రారంభిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భూ సంబంధిత ఫిర్యాదులే అధికంగా వచ్చాయని అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ పక్కనే కూర్చొని ఉండడంతో నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో కలెక్టర్‌కు అందించేందుకు వెనుకాడారు.