Cattle Trader Died: పశువుల సంతలో వ్యాపారస్తుల మధ్య గొడవ.. ఒకరు మృతి - Cattle Trader In Rajam Cattle market
Cattle Trader Died in Rajam Cattle Market: పశువుల కొనుగోలు విషయంలో చెలరేగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలు బలి తీసుకుంది. వ్యాపారంలో తలెత్తిన ఈ వివాదం మాట మాట పెరిగి తొపులాటకు దారి తీసింది. ఈ తోపులాటలో చివరికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం అంబకండి గ్రామానికి చెందిన మండల రాము.. పశువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజాంలో నిర్వహించే పశువుల సంతకు.. అదే గ్రామానికి చెందిన కొందరితో కలిసి రాము వచ్చాడు. పశువుల కొనుగోలు చేసేందుకు వచ్చిన అతను.. జామి మండలం లాటపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరరావు, గంగయ్య అనే ఇద్దరు పశువుల వ్యాపారస్తులతో గొడవపడ్డాడు. పశువుల కొనుగోలు లావాదేవిల్లో తలెత్తిన ఈ వివాదం తొలుత చిన్నగా మొదలై.. చేతులతో దాడి వరకు.. ఆ తర్వాత ముగ్గురి మధ్య తోపులాటకు దారి తీసింది. ఈ ముగ్గురు ఒకరినొకరు తోసుకునే క్రమంలో రాము కిందపడిపోయాడు. కిందపడిపోయిన వెంటనే అతను ప్రాణాలు కోల్పోయాడు. రాము అంతకుముందే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇది గమనించిన మిగిలిన ఇద్దరు వ్యాపారస్తులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.