Differences between YCP leaders: పెదకూరపాడు వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు - YSRCP leaders in Pedakurapadu constituency
Differences between YCP leaders: వైఎస్సార్సీపీలో నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈసారి పెదకూరపాడు నియోజకవర్గంలోని వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇందులో ఒకరిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో వేరువేరుగా మీడియా సమావేశాలు పెడుతూ.. ఆరోపణలకు దిగారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ నాయకుల్లో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బహిష్కరణకు గురైన నాయకులు, వైసీపీ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం నియోజకవర్గంలో రాజకీయ వేడిని రగిల్చింది.
కుటుంబం వేరు.. రాజకీయం వేరంటూ వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన నేత వరప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకరరావు కూడా టీడీపీ నాయకుని ఇంటికి వెళ్లారంటూ ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు రుజువు చేస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని వరప్రసాద్ తెలిపారు.
వరప్రసాద్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే పార్టీ నుంచి బహిష్కరించినట్లు వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డి తెలిపారు. కన్నాను పలుమార్లు కలిశారని విమర్శించారు. ఎమ్మెల్యే శంకరరావు వచ్చిన తర్వాతనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇరువర్గాలు వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి విమర్శలు చేసుకున్నారు.