'కేకును నేలకేసి కొట్టి' మంత్రి Vs జడ్పీటీసీ - సీఎం జగన్ పుట్టిన రోజున భగ్గుమన్న వర్గ విభేదాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 5:48 PM IST
Differences between YCP Leaders in Kurnool District: గత కొంత కాలంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలో మంత్రి గుమ్మనూరు జయరాం, చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షి వర్గీయులు వేర్వేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆస్పరిలో కేక్ కట్ చేసేందుకు మంత్రి కుమారుడు ఈశ్వర్, సోదరులు శ్రీనివాసులు, నారాయణ స్వామి తదితరులు వచ్చారు.
అయితే అక్కడ ఉన్న జడ్పీటీసీ విరూపాక్షి ఫ్లెక్సీలను చూసి రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే మంత్రి గుమ్మనూరు అనుచరులు విరూపాక్షి బ్యానర్లను చించివేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ విలేకరిపై దాడి చేశారు. మరోవైపు జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కేక్ తీసుకుని చిప్పగిరికి వెళుతున్న సర్పంచ్ వెంకటేష్‌ను మంత్రి వర్గీయులు అడ్డుకుని, కేకును నేలకేసి కొట్టారు. అదే విధంగా అతనిపై దాడికి యత్నించారు.