Differences Between Minister Roja and KJ Shanti: నగరి వైసీపీలో విభేదాలు.. వారిద్దరిని కలపాలనుకున్న సీఎం జగన్.. కానీ - నగరి నియోజవర్గంలోని వైసీపీలో వర్గ విభేదాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 5:47 PM IST
Classes Between Minister Roja, KJ Shanti: నగరి నియోజవర్గంలోని వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గంలో పర్యటించిన వేళ.. ఈ విభేదాలు మరోసారి బయటపడటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్సవ సభను ఏర్పాటు చేయగా.. ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పర్యాటక శాఖ మంత్రి (Minister Roja) రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతికి మధ్య గత కొంత కాలంగా విబేధాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ముఖ్యమంత్రి బహిరంగ సభకు హాజరయ్యారు. వీరిద్దరిని కలపటానికి సభా వేదిక వద్ద సీఎం జగన్ ప్రయత్నించారు. ఇద్దరి చేతులు పట్టుకుని.. ఒకరి చేతిలో మరొకరి చేయి కలిపేందుకు ప్రయత్నించారు. మంత్రి రోజా చేతులు కలిపినా.. కేజే శాంతి మాత్రం చేతులు వెనక్కి లాక్కున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కలపాలని యత్నించినా.. కేజే శాంతి చర్యతో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది.