వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు - ఎంపీపీ వర్సెస్ ఎంపీటీసీ - ఎంపీటీసీపై దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 9:56 PM IST
Differences Between Anantapur YCP Leaders: వైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒక్కరు వైసీపీ ఎంపీపీ మరొకరు అదెే పార్టీకి చెందిన ఎంపీటీసీ.. గత ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో ఎంపీపీని ఎన్నుకునే సమయంలో వర్గపోరు మెుదలైంది. ఆ గొడవ చల్లార్చడం కోసం పదవి కాలాన్ని చెరో రెండున్నర సంవత్సరాలు చేపట్టే విధంగా పార్టీ పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగా మెుదట ఎంపీపీ పదవి చేపట్టిన మహిళ తన పదవికి రాజీనామా చేయకుండా ఇంకా ఎంపీపీగానే కొనసాగుతుంది. రెండున్నర సంవత్సరాలు దగ్గర పడుతున్నా.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎంపీపీ తన పదవికి రాజీనామా చేయడం లేదు. ఎంపీపీ రాజీనామా కోసం ఆ ఎంపీటీసీ గత కొంత కాలంగా వివిధ ప్రభుత్వం కార్యక్రమాల్లో ఎంపీపీని నిలదీస్తూ వస్తోంది. తాజాగా.. ఇరువర్గాల పోరుకు 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమానికి వేదికైంది.
రాజీనామా విషయంలో ఎంపీపీ సునీత, బుక్కరాయసముద్రం ఎంపీటీసీ కాలువ వెంకటలక్ష్మి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లిలో నిర్వహించిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ సునీత, జడ్పీటీసీ భాస్కర్, సర్పంచ్ పార్వతి కలిసి సచివాలయం వద్ద ప్రభుత్వ పథకాల ప్రచార బోర్డును ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ప్రజాప్రతినిధులు స్టేజిమీదకు ఆహ్వానించే విషయంలో ఎంపీపీని ఆహ్వానించలేదు. నేరుగా వైస్ ఎంపీపీ జయలక్ష్మి పిలవడంతో.. ఎంపీపీ సునీత అగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ముందుగా తనను స్టేజి మీదకి పిలవకుండా ఎంపీటీసీని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఎంపీటీసీ భర్త ఎంపీపీతో వాగ్వాదానికి దిగారు. ఇచ్చిన మాట ప్రకారం పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఎంపీపీ సునీత మాట్లాడుతూ.. తాను ఉద్యోగానికి రాజీనామా చేసి లక్షల ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. రెండేళ్లకు రాజీనామా చేస్తానని తాను ఎక్కడ చెప్పలేదన్నారు. తనకే అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు సర్ధిచెప్పడంతో కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. జగనన్న కార్యక్రమం కోసం వచ్చిన గ్రామ ప్రజలు ఎంపీపీ, ఎంపీటీసీల మధ్య తగాదా చూస్తూ ఉండిపోయారు.